ఇప్పటి తరం పిల్లల దృష్టి లో పెళ్లి అనేది ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరి ఇష్టం . మిగిలిన వారికీ ఈ విషయం తో సంబంధం లేదు. కానీ కొంత కాలం క్రితం వరకు పెళ్లి పెద్ద వాళ్ళ నిర్ణయం. పాశ్చాత్య ఆక్రమణలు పాలనా దృష్ట్యా అమ్మాయిలని ఇంట్లో నుంచి బయటకు పంపే వారు కాదు. ఇంట్లోనే చదవటం వ్రాయటం నేర్పే వారు. ఇక అమ్మాయి అబ్బాయి ఒకరికి ఒకరు తారసపడే అవకాశం అవసరం కానీ లేని నేపథ్యం లో ప్రేమ పెళ్లిళ్లు అనేవి అరుదు. కౌమార దశ లో అడుగు పెట్టి స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ మొదలయ్యే మునుపే వారి పెళ్లిళ్లు పెద్దలు నిర్ణయించేసే వారు.
చరిత్ర లో కొంచెం వెనక్కి వెళితే ఒక కులం /జాతి వారు సమూహాలు గా నివసించేవారు. చేసే పని ఆధారంగా ఏర్పడ్డాయి కులం / జాతి. ఒక పని చేసే వారు ఒకే చోట ఉండేవారు .వృత్తి పరమైన సాధక బాధకాలు పంచుకునేందుకు, ఐకమత్యం గా ఉండేందుకు వీలుగా ఉండేది. ఆ సమూహం లోనే పెళ్లిళ్లు చేసుకునే వారు. అంట మాత్రాన ఒక కులానికి ఇంకో కులానికి మధ్య శత్రుత్వం ఉన్నట్టు కాదు. వృత్తి కుటుంబ జీవితం రెండు వేరు వేరు ఉండేవి కాదు. వృత్తి కి సంబందించిన అంశాలు జీవన విధానం లో మిళితమై ఉండేవి. ఇట్టి పరిస్థితి లో వేరే కులం / జాతి అమ్మాయి లేదా అబ్బాయిని పెళ్లి చేసుకోవటం అనేది వాస్తవ దూరం .సమాజం లో కట్టుబాట్లు కూడా అలానే ఉండేవి. వాటిని అతిక్రమించడానికి సాహసం చేసే వారు కాదు. సామాజిక కట్టుబాట్ల వల్ల ప్రయోజనాలు దుష్ప్రయోజనాలు రెండూ ఉండేవి.
ప్రేమ పెళ్లిళ్లు పెరగడానికి రెండు కారణాలు. ఒకటి నగరీకరణ మరియు సమాజిక వికేంద్రీకరణ. రెండు చదువుకునే పని చేసే ప్రదేశాల్లో ఒకరి తో ఒకరి కలసి మసలుకోవలసిన అవసరం అవకాశం ఉండటం. టీనేజ్ లేదా కౌమార దశ స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ ఎక్కవ గా ఉండే దశ. హార్మోన్ల ప్రభావం అధికం గా ఉండే సమయం. జీవితపు లోతులు అర్ధం కాని ఒక అపరిపక్వమైన దశ . ఈ సమయం లో చదువు లక్యం మీద దృష్టి పెట్టాలి. ప్రేమ పెళ్లి వ్యక్తి గత విషయాలు. మునుపు ఎన్నడూ లేని సమాచార విప్లవ యుగం లో ఉన్నాం. దీన్ని మంచి కి ఉపయోగించు కుని సమిష్టి అభ్యున్నతి కి పటు పడాలి కానీ చాటింగ్ అనే వృధా ప్రక్రియ కి సమయం వెచ్చించ కూడదు. చదువు పూర్తి అయ్యి లక్ష్యం చేరుకునే వరకు ఈ ప్రేమ అనే అంశం వాయిదా వేస్తే మెరుగైన నిర్ణయం తీసుకోగలుగుతారు.
కులాలు కుల వృత్తులు లేవు ఎవరు ఏ పని అయినా చెయ్యచ్చు అన్నప్ప్పుడు పెళ్లి ఎవరినైనా చేసుకోవచ్చా అన్నది ప్రశ్న? ఈ ప్రశ్న తో సమాజం బుర్ర బద్దలు కొట్టుకోవలసిన పని లేదు. ఒక వ్యక్తి ఇంటి సరిహద్దులు దాటి బయటకి అడుగు పెట్టాక వేరొకరు ఏ వర్గము భాష ప్రాంతము లాంటి విషయాలు అసంబద్ధం. నాలుగు గోడల మధ్య ఏ వ్యక్తి తో కలసి బ్రతకాలో అన్నది వ్యక్తి గత నిర్ణయం. ప్రభుత్వాలు , ప్రసార మాధ్యమాలు, సినిమాలు ప్రేమ పెళ్లిళ్లు తప్పా ఒప్పా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి వ్యక్తిగత నిర్ణయం.
గ్రామీణ / వెనక బడిన వర్గాల్లో కులం ఉనికి ఇంకా అనేక రూపాల్లో ఉంది. కుల ప్రాతిపదికన రాజకీయ పార్టీల తో అనుసంధానం తో ఒకింత ఉత్కంఠ వాతావణం నెలకొంటోంది. అభివృద్ధి ఫలాల కి దూరంగా వెనుక బడి ఉన్న వర్గాలు ఎన్నో ఉన్నాయి. భూస్వామ్య వ్యవస్థ ఇంకా కొన్ని చోట్ల వాస్తవం. సాహసం తెగింపు కలిగిన వారు ఈ సమస్యలు తీర్చడానికి బదులు ప్రేమించి పెళ్లి చేసుకోవడమే సాహస కృత్యం గా పెట్టుకుంటున్నారు . ఇది రెండు కుటుంబాల మధ్య రెండు వర్గాల మధ్య పోరుకు దారి తీస్తోంది. ఇదే కులాంతర వివాహం పట్టణ ప్రాంతం లో హాయిగా జరుగుతూ ఉండటం చూస్తున్నాం.
చదువు పూర్తీ చెయ్యకుండా ఉద్యోగం ఆర్ధిక స్థిరత్వం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. ప్రియుడు లేదా ప్రియురాలు తో కనిపించడం కుటుంబ సభ్యులు వద్దనడం , జంట తెగించి పారిపోయి పెళ్లి చేసుకోవడం కనిపిస్తోంది. కుటుంబ సభ్యులు ఆలోచన సంకుచితము అనుకుందాం . ప్రేమించు కోవడానికి డబ్బు పెద్ద గా అవసరం లేకపోయినా బ్రతకడానికి డబ్బు కావాలి. ఈ అపరిక్వమైన చర్య తో సమాజానికి ఏమి సంకేతం ఇస్తున్నారు ప్రేమికులు?ఇలాంటి వారికి ప్రభుత్వం ఆదర్శ వివాహం పేరిట పారితోషకం ఇవ్వాల్సిన అవసరం ఉందా ?జంట వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు ఆగితే ఇంట్లో ఒప్పుకోకపోయినా వెళ్లి ఎక్కడో బ్రతకచ్చు .
దేశ వ్యాప్తంగా పరువు హత్యలు జరుగుతున్న తీరుతెన్నుల్లో మార్పులు ఉన్నాయి. సొంత పిల్లల్ని, పెళ్లి చేసుకున్నభార్య /భర్తని చంపుతున్న వాళ్ళు ఉన్నారు ఉత్తరాదిన. వాళ్ళ అమ్మాయి / అబ్బాయి పెళ్లి చేసుకున్న వాళ్ళని చంపేసి వాళ్ళ అమ్మాయి /అబ్బాయి కి మళ్లి పెళ్లి చెయ్యచ్చు అనుకుంటున్నారు దక్షిణాదిన. పెద్ద మనసు చేసుకో గలిగితే ఆశీర్వదించడం , లేదంటే వారి విధి కి వారిని వదిలి వెయ్యడం రెండే మార్గాలు. ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికీ లేదు. సొంత పిల్లలు కావచ్చుకాని వారిని చంపే హక్కు లేదు.
వర్గ , భాష , ప్రాంత విభేదాల కి అతీతం గా హిందూ సమాజం సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. ఇన్ని రకాల తేడాల తోను అరమరికలు లేకుండా కలిసి అందరు ఉండడమే భారత దేశం గొప్పతనం. ఎటువంటి వైవిధ్యాలు లేని సమాజం కావాల్సిన అవసరం లేదు. అన్ని వర్గాల అభివృద్ధి ఒక సమాజం లక్ష్యం కావాలి . అందరికి సమాన అవకాశాలు కావాలి . ప్రేమ పెళ్లి వ్యక్తిగత విషయం . అది ఒక సమాజం లక్ష్యం కానక్కర్లేదు .
మతాంతర వివాహాల సంఖ్య రోజు రోజు కి ప్రేరుగుతోంది. ఇద్దరు ఇష్టపడి చేసుకుని ఇద్దరి కి వారి మత విశ్వాసం అనుసరించే స్వేచ్ఛ ఉంటే అది వారి ఇష్టం. మత మార్పిడులే లక్ష్యం గా విదేశీ ప్రోద్బలం తో జరుగుతున్న పెళ్లిళ్లు గురించి మాట్లాడుకుని తీరాలి. లవ్ జిహాద్ పేరుతో అమ్మాయిలకు ప్రేమ వల వేసి మతం మార్చి పెళ్లి చేసుకుంటున్నారు. అందరికి తెలియని విషయము ఏంటంటే ఇదే తరహా మత మార్పిడి వలలు క్రైస్తవ సంస్థలు కూడా ప్రయోగిస్తున్నాయి అని. మన సంస్కృతికి విఘూతము కలిగించడం బాహ్య శక్తుల ధన బలం పని చేస్తుంటే అది ఎదుర్కోవలసిన అవసరం ఉందా లేదా?? ఇవన్నీ అర్ధం చేసుకొని అమ్మాయిలు ఎవరో ఒకర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే చాలు అనుకుంటే ఎలా? యుగాల నాడే వసుధైవ కుటుంబకం , అని లోకాస్సమస్తా సుఖినోభవంతు ని ప్రవచించిన నేల మనది. వేల సంవత్సరాల అవ్విఛ్చిన్న నాగరికత కలిగిన మనం ఆ సంస్కృతి కి తూట్లు పడుతుంటే కాపాడుకోవటం మన బాధ్యత.
తస్మాత్ జాగ్రత్త .
No comments:
Post a Comment