Friday, February 14, 2025

పెళ్లి


సమస్త ప్రాణి కోటి లోను తెలివైన వాడిగా తనను తాను ప్రకటించుకున్న మనిషి నాగరికత నేర్చుకుని కుటుంబాలు గాను సమూహాలు గాను జీవించటం మొదలు పెట్టాడు. విశృంఖలత్వం ఉన్న జంతువు లా కాక ఒక పురుషుడు కి ఒక స్త్రీ వారికి కలిగిన సంతానం ఒక కుటుంబం గా జీవించడం మొదలెట్టాడు.  ప్రపంచం లో చాలా దేశాల్లో పితృస్వామిక సమాజాలే అధికం. భారత దేశం లోను పితృస్వామ్య  సమాజాలు అత్యధికం. 

కుల వృత్తులు జీవనాధారం గా ఉండే రోజుల్లో ఒక వ్యక్తి వృత్తిని  తన పూర్వీకుల నుండి స్వీకరిస్తున్నాడు. తండ్రే ప్రధమ గురువు. తండ్రి తన వృత్తి నైపుణ్యాలను మగ సంతానానికి ప్రసారం చేసేవారు. ఆ ఇంటికి భార్య గా వచ్చిన అమ్మాయి ఆ ఇంటి బాధ్యతలు, వృత్తి తాలూకా సహాయ బాధ్యత చేపట్టేది. ఈ ఇంట్లో పుట్టిన అమ్మాయి వేరొక ఇంటి కోడలిగా బాధ్యతలు నిర్వహించేది. దీంతో ఒక అమ్మాయిని  ఇంకో ఇంటికి పంపించడమే ఒక లక్ష్యంగా మారి "ఆడ పిల్ల " అయింది . 

పెళ్లి తర్వాత అమ్మయి బాగోగులు వారే వహిస్తారని పెళ్లి ఖర్చులు,ఇతర లాంఛనాలు  అమ్మాయి తల్లి తండ్రులు పెట్టుకుని పెళ్లి చేసే వారు. స్థిర ఆస్తి(ఉంటున్న ఇల్లు ) ఎక్కువ గా మగ సంతానానికి వారసత్వం గా ఇచ్చేవారు. చరాస్తులు( బంగారం) లాంటివి ఆడ సంతానానికి  ఇచ్చేవారు.పొలాలు ఎక్కవ గా ఉన్న కుటుంబాలు పెళ్లి సమయం లో కొంత వాటా ఆడ పిల్ల(ల)కి కట్నం గా ఇచ్చేవారు.  

ఈ నేపధ్యం లో తమ వృత్తిని కొనసాగించే వారి కోసం, తమ తో ఉండే వారి కోసం , వృద్ధాప్యం లో తమని చూసే వారి కోసం , తదనంతరం తల కొరివి పెట్టె వారి కోసం మగ పిల్లాడు కావాలి , మగ పిల్లాడే కావాలి అనుకునేవాళ్ళు. ఇది ఆడ పిల్ల పట్ల వివక్షగా పరిణమించింది.  కట్న కానుకలు ఇవ్వలేని పక్షం లో ఆడ పిల్లని భారం గా చూసే పరిస్థితి నెలకొంది. కొన్ని సార్లు మగ పెళ్లి వారి అత్యాశకి ,మగ పెళ్లి వాళ్ళ ఆధిపత్యానికి దారి   తీసింది.  

ఒక శతాబ్ద కాలం గా మారిన సామజిక ఆర్ధిక పరిస్థితులు అనేక మార్పులు తీసుకుని వచ్చాయి.  అమ్మాయి లు అబ్బాయిలు తేడా లేకుండా  చదువుల నిమిత్తం బయటకు వెళ్తున్నారు. ఉద్యోగాలు కోసం వారి గమ్య స్థానాలు వెతుక్కుంటూ ఖండాంతరాలు దాటి వెళ్తున్నారు. చదువులు ఉద్యోగాల నిమిత్తం ఇల్లు వదిలి వెళ్ళుతున్నారు. ఉమ్మడి కుటుంబాలు ఉండడానికి ఇష్టం యువతరం, ఉంచుకోవడానికి పెద్ద తరం ఇష్టం ఉందని రోజులు ఇవి. 

ఆడ పిల్లైనా మగ పిల్లాడైన ఒకటే అనుకుంటున్నాం .ఎవరైనా ఇద్దరు పిల్లలు చాలు అనుకునే  స్థితి లో ఉన్నాం. ఎవరైనా తేడా లేకుండా సమానంగా చదివిస్తున్నాం. వారు ప్రయోజకులు అయినా తర్వాత పెళ్లి చేస్తున్నాం. పెళ్లి తో ఒటైన జంట ఇద్దరి తల్లి తండ్రుల బాధ్యత తీసుకుంటున్నారు. ఎవరికీ సంబంధించిన ఆస్తులని  ఇద్దరు పిల్లలకి వారే సమానం గా పంచి ఇస్తున్నారు. (equal sharing of assets & liabilities ). బాధ్యతల్ని ఆస్తులని పిల్లలు (ఆడైన మగైనా) సమంగా పంచుకునేటప్పుడు, ఆడ పిల్ల వాళ్ళు మగ పెళ్లి వాళ్ళు అనే ప్రస్తవన అప్రస్తుతం.

స్త్రీ పురుషుడు లో ఎవరు గొప్ప ఎవరు ఎక్కువ అన్న ప్రశ్న కి సమాధానం దొరకదు. ఎవరి బలాలు బలహీనతలు వారివే . వారి సామర్ధ్యాలు వేరు గా ఉండొచ్చు. వారి పని విభజన వేరుగా ఉండొచ్చు. వేష ధారణ వేరు  కావచ్చు. ఇవి కాలానుగుణంగా మారుతూ ఉండొచ్చు. ఒక స్త్రీకి పురుషుడి వల్ల పురుషుడికి స్త్రీ వల్ల పరిపూర్ణత్వం లభిస్తుంది. ఇద్దరు ఒకరికి ఒకరు పరిపూర్ణత్వం(complimentary ) కలగజేస్తున్నారు. అయినా పుట్టేది ఆడ పిల్లా మగ పిల్లాడా మన చేతుల్లో లేని విషయం. ఏ మాత్రం నియంత్రణ లేని విషయం మీద అంత తర్జన భర్జన పడాల్సిన  పని లేదు. మగ పెళ్లి వారమనే ఆధిపత్యానికి అర్ధం లేదు. 

పూర్వం ఎక్కువ మంది పిల్లలు కావటం చేత బాధ్యతలు పూర్తీ అయ్యేటప్పడికి ఒక వైరాగ్యం వచ్చేది . ఈ రోజుల్లో ఇద్దరు పిల్లలు కావటం తోపెరిగిన ప్రసార సాధనాలతో ఇరు వర్గాల మితి మీరిన జోక్యం ఎక్కువైంది. ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు అనారోగ్యకర పోటీ జంట కి ప్రమాదకరం. ఏ వర్గము జంట తో ఇంకొక వర్గం సంబంధాలని శాసించే ప్రయత్నం చేయకూడదు.  మగ పెళ్లి వాళ్ళము అనే మిష తో ఆడ పెళ్లి వాళ్ళ ఆస్తుల  మీద పెత్తనం చెయ్యాలనుకోవటం తగిన పని కాదు. మగ పెళ్లి వారు ఆడ పిల్లని, పిల్లనిచ్చిన వాళ్ళని అనుక్షణం తూలనాడడం క్షమించరాని నేరం. 

ఏ రోజుల్లో అయినా అడా పిల్ల మర మనిషో పని మనిషో కాదు. తను పుట్టి పెరిగిన ఇల్లు వదిలి పెట్టి ,మెట్టిన  ఇంట్లో అడుగు పెట్టి. ఆ ఇంటిని తన ఇంటిగా చేసుకుని , తన ఇంటి పేరు మార్చుకుని , గోత్రం మార్చుకుని , మెట్టినింటి పేరు గల వంశోద్ధారకులని నవ మాసాలు మోసి , వారిని కని  వారి మల మూత్రాదులు తీసి , వారికీ విద్య బుద్ధులు నేర్పి. పిల్లలని పెంచి  పెద్ద చేస్తుంది. ఆధునిక కాలం లో వృత్తి ధర్మమూ కుటుంబ ధర్మమూ రెండు సమన్వయము చేసుకుంటూ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తుంది. 

పెళ్లి లో భాగం గా అనేక క్రతువులు ఆచరణ లో ఉన్నాయి . అందులో ముఖ్యమైనది కన్య దానం . పెళ్లి లో వరుడు ని లక్ష్మి నారాయణ స్వరూపుడి గాను వధువు ని లక్మి స్వరూపిణీ  గాను భావిస్తారు. విష్ణు రూపం లో ఉన్న వరుడు యాచకుడై వచ్చి లక్ష్మి స్వరూపిణి అయిన కన్య ను తనకి దానం గా  ఇమ్మని ఆర్థిస్తాడు. కన్యా దాతలు తమ కుమార్తెను వరుడి గృహస్థ ధర్మం పూర్తీ కావడం కోసం దానం గా ఇస్తారు. కన్య దాన ఫలం వల్ల బ్రహ్మ లోకాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెపుతున్నాయి.  మిగిలిన దానాలకి కన్య దానాలకి తేడా ఉంది. అన్ని దానాలలోను సంప్రదయేన ఇదం నమమ అని చెపుతారు. అంటే దానం ఇచ్చిన వస్తువుకు తమ కు ఎలాంటి సంబంధం లేదు అని అర్ధం(సర్వ హక్కులతో దానం) . కానీ కన్యా దానం లో ఈ మంత్రం చదవ కూడదు. పెళ్లి చేసుకున్న జంట కి కన్య దాతలకి సంబంధ భాంధవ్యాలు కొనసాగాలి.  నాతి చరామి అని వరుడు ప్రణామం చేసి అమ్మాయి బాధ్యత తీసుకుంటాడు. 

ఆడ పిల్ల ఏమి చదువు కుంది ఎంత సంపాదిస్తుంది , ఎంత ఆస్తి వస్తుంది అని చూసుకుని పెళ్లి చేసుకుంటున్నారు.పెళ్లి తర్వాత ఆడ పెళ్లి వాళ్ళు ఏమి ఖర్చు పెట్టాలో మగ పెళ్లి వాళ్ళు నిర్ణయించాల్సి పని లేదు. ఉద్యగస్తురాలు కావాలి  అని పెళ్లి చేసుకుని ఇంటి పనిలో ఏ మాత్రమూ సహాయం చెయ్యని భర్తలు ఉన్నారు. అల్లుడు కూతురు కు సహాయం చెయ్యొచ్చు కానీ కొడుకు కోడలి కి సహాయం చేస్తే చేత కానీ తనం  అని నూరి పొసే తల్లి తండ్రులు ఉన్నారు. కాలానుగుణంగా మగ పిల్లాడి పెంపకం లో మాత్రం ఎందుకు మార్పు రావడం లేదు?సంపాదిస్తూ కూడా ఆర్ధిక స్వేచ్ఛ లేని ఆడ  వారు ఉన్నారు. 

స్త్రీకి ఆర్ధిక స్వేచ్ఛ పెరగటం వల్ల విడాకులు ఎక్కువ అవుతున్నాయని అనడం లో కొంత మాత్రమే నిజం ఉంది. రెండు భిన్న నేపద్యాల్లో పెరిగిన ఇద్దరు ఒకటి గా బ్రతకాలంటే ఇద్దరు సర్దుకోవడం తప్పనిసరి. కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నా ఇద్దరు సర్దుకోవడం తప్పదు. కోడలిగా వచ్చిన ఆడ పిల్లే మొత్తం మారిపోవాలి అని అత్త గారు నిర్ణయించడం ఎంత వరకు సబబు.ఈ అత్తగారు పుట్టి పెరిగిన ఇల్లు వదలి ఇంకో ఇంట్లో అడుగు పెట్టిన ఒకప్పటి కోడలే. అమ్మాయి అబ్బాయి ఇద్దరి తండ్రి తండ్రులతో సర్దుకోవాలి. తల్లి తండ్రులు కోడలు లేదా అల్లుడుతో సర్దుకోవాలి

అమ్మాయిలు తక్కువై మగ పిల్లలకి పెళ్లి కుదరటం కష్టం గా ఉన్న రోజుల్లో ఉన్నాం. కానీ మారని పాత తరం మగ పెళ్లి వాళ్ళు అలానే ఉన్నారు. ప్రవచన కర్తలు సామజిక మాధ్యమాల్లో ఆడ పెళ్లి వారి వింత కోరికల(మగ పిల్లాడి అమ్మ నాన్న ఉండకూడదు, ఆస్తి మాత్రమే కావాలి) గురించి ఎక్కువ ప్రస్తావిస్తున్నారు. కానీ మారని పాత తరం మగ పెళ్లి వాళ్ళ గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు. ఆడ పిల్ల చాకిరీ కి కావాలి ఆస్తి కూడా కావాలి కానీ అమ్మ నాన్న ఉండకూడదు. అమ్మాయి తన తల్లి తండ్రులను చూడకూడదు. పెళ్లి తర్వాత వచ్చిన కోడలు వాళ్ళ సొత్తు అన్నట్లు గా  మగ పెళ్లి వాళ్ళు ఉంటే ఆడ పిల్లలు మాత్రమే ఉన్న వాళ్ళు ఏమి చేస్తారు? అమ్మాయికి పుట్టింటి ఆస్తి లో హక్కు ఉందని కోర్టులు చెపుతున్నాయి. కన్నతల్లి తండ్రుల బాధ్యత అమ్మాయి మీద ఉందని కోర్టులు చెపుతున్నాయి.. 

సనాతన ధర్మంలో ఇతర మత విశ్వాసాల్లో లాగా స్త్రీని ఒక భోగ వస్తువు లాగో పిల్లల్ని కనే యంత్రం లానో చూడలేదు .పూర్వ కలం లో  బహుభార్యత్వం ఒప్పుకున్నపటికి ఏక పత్ని వ్రతుడైన శ్రీరామ చంద్రుడే దాంపత్యానికి ఆదర్శం. ఏ మాత్రం అమలు లేని అందులో ఏముందో తెలియని మను స్మ్రుతి మన సమస్యలు అన్నింటి కారణంగా భావిస్తే ప్రయోజనం లేదు.

ప్రపంచ వ్యాప్తం గా పెళ్లి పట్ల యువత విముఖత చూపిస్తున్నారని సర్వేలు చెపుతున్నాయి. సహజీవనం వగైరా వింత పోకడ లతో విశృంఖలత్వం పెరుగుతున్న రోజులివి. మారుతున్న కాలమాన పరిస్థితుల కి అనుగుణం గా ఏ మార్పు అవసరమో ఆ మార్పు రాకుండా పెళ్లి పవిత్రతను ,ఔన్నత్యాన్ని ప్రవచిస్తే ఉపయోగం లేదు. తరాల మధ్య అంతరం అనివార్యం. శర వేగం గా మారుతున్న పరిస్థితుల మధ్య కాపాడుకోవలసిన విలువలు ఏంటి , వదిలిపెట్టవలసిన భావాలూ ఏంటి అన్నది చాల ముఖ్యం.  కుటుంబ వ్యవస్త విచ్ఛిన్నం కాబోతున్న విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం. కాలమాన పరిస్థితులని బట్టి మార్పులు చేసుకోక పోతే భవిష్యత్తు అగమ్య గోచరం. 



పెళ్లి

సమస్త ప్రాణి కోటి లోను తెలివైన వాడిగా తనను తాను ప్రకటించుకున్న మనిషి నాగరికత నేర్చుకుని కుటుంబాలు గాను సమూహాలు గాను జీవించటం మొదలు పెట్టాడు....